అన్ని వసతులతో గిరిజన గ్రామాల అభివృద్ధి : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

అన్ని వసతులతో గిరిజన గ్రామాల అభివృద్ధి : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

అశ్వారావుపేట/ దమ్మపేట, వెలుగు: అటవీ ప్రాంతాల్లోని గిరిజన గ్రామాల్లో అన్ని వసతులు కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. మంగళవారం ఐటీడీఏ పీవో రాహుల్ తో కలిసి అశ్వారావుపేట మండలంలోని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైన మోద్దుల మాడ కొండరెట్లలో ‘రచ్చబండ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో 176 కుటుంబాలు నివసిస్తున్నాయని, అందులో 75 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు.

గ్రామ పరిధిలో 360 ఎకరాల సాగుభూమి ఉండగా, కొంతమందికి ఇప్పటికే పోడు పట్టాలు ఉన్నాయని, మిగిలిన వారికి కూడా పట్టాలు అందించేందుకు కృషి చేస్తానన్నారు. గిరిజనులకు ఉపాధి అవకాశాలు పెరిగేలా ఖాళీ భూముల్లో ఆయిల్ పామ్, వెదురు పంటల సాగుకు అధికారులు సమన్వయం చేయాలని సూచించారు. గ్రామ శివారులోని గుట్టపై ఉన్న అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు, గుట్ట కిందనున్న చెరువును మరమ్మతులు చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

గ్రామ సమస్యలను తెలుసుకుని సర్పంచ్ పండు రెడ్డి సహకారంతో తక్షణ పరిష్కార చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఐటీడీఏ పీవో రాహుల్ మాట్లాడుతూ, ఐటీడీఏ నిధులతో ఎమ్మెల్యే సహకారంతో గ్రామస్తుల అభ్యర్థన మేరకు జూన్ 30 నాటికి కంటైనర్ మొబైల్ దవాఖానాను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అశ్వారావుపేట గిరిజన భవన్‌‌‌‌లో 100 రోజుల ప్రణాళికతో వివిధ నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

అనంతరం నల్లపాడులో 70 నాయకపోడు గిరిజన కుటుంబాలకు ఉపయోగపడేలా 45 ఎకరాల పోడు భూముల కోసం రూ.23 లక్షలతో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌‌‌‌ఫార్మర్, బోర్వెల్‌‌‌‌ను ప్రారంభించారు.  దమ్మపేట పట్టణంలో వ్యవసాయ శాఖ, సహకార శాఖల సంయుక్త ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలను ఎమ్మెల్యే రైతులకు అందజేశారు.